World Athletics Championships 2023: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ బరిలో జ్యోతి..

ఈ నెల ఆగస్టు 19 నుంచి హంగేరిలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

Update: 2023-08-08 14:54 GMT

న్యూఢిల్లీ : ఈ నెల ఆగస్టు 19 నుంచి హంగేరిలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27 వరకు పోటీలు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 28 మందితో కూడిన భారత బృందంలో పాల్గొననున్నది. తెలుగమ్మాయి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యర్రాజి జ్యోతి వరల్డ్ చాంపియన్‌షిప్‌ బరిలో ఉన్నది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో జ్యోతి కొంతకాలంగా సత్తాచాటుతున్నది.

ఇటీవలే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గింది. అలాగే, చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో రజతం గెలుచుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈమె ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించింది. భారత బృందానికి టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు. గతేడాది అమెరికా జరిగిన పోటీల్లో అతను రజతం గెలుచుకోగా.. ఈ సారి స్వర్ణంపై ఫోకస్ పెట్టాడు.

అతనితోపాటు జావెలిన్ త్రోలో డీపీ మను, కిశోర్ కుమార్ జెనా, మహిళా అథ్లెట్ అన్ను రాణి పాల్గొంంటున్నారు. అలాగే, స్టార్ లాంగ్ జంపర్ మురళీ శంకర్ సైతం బరిలో ఉన్నాడు. షాట్‌పుటర్ తాజిందర్ పాల్‌సింగ్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమవ్వగా... హైజంపర్ తేజస్విన్ శంకర్, 800 మీటర్ల రన్నర్ కెఎం చందా, 20 కి.మీ రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి సైతం దూరంగా ఉన్నారు.


Similar News