పారా అథ్లెట్లకు క్రీడా శాఖ నజరానా.. ఎవరికి ఎంతంటే?

పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-10 15:29 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారా విశ్వక్రీడల చరిత్రలోనే రికార్డు స్థాయిలో పతక పంట పండించారు. పారా వీరులు 29 పతకాలు సాధించారు. అందులో 7 బంగారు పతకాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పతకాలు సాధించిన పారా అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. పారా అథ్లెట్లను మంగళవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సన్మానించారు.

ఈ సందర్భంగా క్రీడా శాఖ స్పోర్ట్స్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం పతక విజేతలకు నగదు బహుమతిని ప్రకటించినట్టు తెలిపారు. స్వర్ణం సాధించిన వారికి రూ. 75 లక్షల చొప్పున, రజత విజేతలకు రూ. 50 లక్షల చొప్పున, కాంస్యం సాధించిన వారికి రూ. 30 లక్షల చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. మిక్స్‌డ్ టీమ్‌లో మెడల్ గెలిచిన ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ రూ. 22.50 లక్షలు అందనున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ..‘పారాలింపిక్స్, పారా క్రీడల్లో దేశం దూసుకపోతోంది. 2016లో నాలుగు పతకాల నుంచి పారిస్‌లో 29 మెడల్స్ గెలిచింది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే పారాలింపిక్స్‌లో పారా అథ్లెట్లు మరిన్ని పతకాలు, స్వర్ణాలు సాధించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.’ అని తెలిపారు. 


Similar News