నా హాఫ్ సెంచరీ సమైరాకు అంకితం : Tilak Varma

విండీస్ పర్యటనలో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా యువ క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు.

Update: 2023-08-07 14:19 GMT

న్యూఢిల్లీ : విండీస్ పర్యటనలో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా యువ క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ఓటమిపాలైనప్పటికీ తిలక్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండో టీ20లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన అతను.. ఈ హాఫ్ సెంచరీని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమిస్తున్నట్టు తెలిపాడు. మ్యాచ్ అనంతరం తిలక్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియాలో తిలక్ మాట్లాడుతూ.. సమైరాకు తన తొలి హాఫ్ సెంచరీని అంకితమివ్వడానికి గల కారణాన్ని తెలిపాడు.

‘రోహిత్ భాయ్ కూతురు సమైరాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని అంకితం ఇస్తానని సమైరాకు ప్రామిస్ చేశా.’ అని తిలక్ తెలిపాడు. అలాగే, రోహిత్ శర్మ తనకు చాలా సపోర్ట్ ఇస్తాడని చెప్పాడు. ‘అతను ఎప్పుడు నాకు సపోర్ట్ సిస్టమ్. ఎప్పుడు ఆట గురించే నాతో మాట్లాడుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా ఆడాలో చెబుతాడు. ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడమని చెబుతాడు.’ అని చెప్పుకొచ్చాడు. రెండో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ తిలక్ 41 బంతుల్లో 51 పరుగులతో రాణించి భారత్‌కు పోరాడే స్కోరు అందించాడు. అయితే, ఛేదనలో పూరన్ చెలరేగడంతో తిలక్ పోరాటం వృథా అయ్యింది.


Similar News