Rebecca Cheptegei:దారుణం..ఉగాండా మారథాన్ రన్నర్ రెబెక్కాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి

పారిస్ ఒలింపిక్స్‌ క్రీడలలో పాల్గొన్న ఉగాండా(Uganda) మారథాన్ రన్నర్ 33 ఏళ్ల రెబెక్కా చెప్టెగీ(Rebecca Cheptegei) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-09-06 20:21 GMT

దిశ, వెబ్‌డెస్క్:పారిస్ ఒలింపిక్స్‌ క్రీడలలో పాల్గొన్న ఉగాండా(Uganda) మారథాన్ రన్నర్ 33 ఏళ్ల రెబెక్కా చెప్టెగీ(Rebecca Cheptegei) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రోజు రెబెక్కా ప్రార్థనల కోసం నార్త్-వెస్ట్ కెన్యా(Kenya)లోని ఓ చర్చికి వెళ్ళింది.చర్చి నుండి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో రెబెక్కా మాజీ ప్రియుడు,డిక్సన్ ఎన్డీమా మారంగాచ్‌(Dickson Ndiema Marangach) ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.దీంతో ఆమె శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది.ఆమె కాలిపోవడం గమనించిన స్థానికులు రెబెక్కాను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత అంటే గురువారం మరణించిందని కెన్యా,ఉగాండా మీడియాలు నివేదించాయి.

అయితే ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympics)లో, మహిళల మారథాన్ ఈవెంట్‌లో రెబెక్కా చెప్టేగీ 44వ స్థానంలో నిలిచింది.చెప్టెగీ 2010 నుండి గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్‌లలో పోటీపడుతోంది.ఇప్పుడిప్పుడే ఉగాండా దేశానికి ఆశా కిరణంగా మారుతున్న సమయంలో రెబెక్కా మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు.కాగా రెబెక్కా చెప్టెగీ హత్య నేపథ్యంలో ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉగాండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. రెబెక్కా మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు , అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై, ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే(Donald Rukare) స్పందించారు.రెబెక్కా చెప్టెగీ చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.కాగా కెన్యాలో ఒలింపియన్‌పై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. 2021లో, కెన్యా రన్నర్ ఆగ్నెస్ టిరోప్‌ (Agnes Tirop)ను ఆమె మాజీ భర్త ఇమ్మాన్యుయేల్ ఇబ్రహీం రోటిచ్(Emmanuel Ibrahim Rotich) కత్తితో పొడిచి చంపాడు.


Similar News