Asian Champions Trophy hockey : ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో సౌత్ కొరియా చిత్తు

చైనాలో జరుగుతున్న ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ‌లో భారత పురుషుల హాకీ జట్టుకు ఎదురులేకుండా పోయింది.

Update: 2024-09-16 12:10 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ‌లో భారత పురుషుల హాకీ జట్టుకు ఎదురులేకుండా పోయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ నిలబెట్టుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీస్‌లో భారత్ 4-1 తేడాతో సౌత్ కొరియాను చిత్తు చేసింది.

మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో ఉత్తమ్ సింగ్ జట్టు ఖాతా తెరిచాడు. 13వ నిమిషంలో రాజ్‌కుమార్ నుంచి పాస్ అందుకున్న ఉత్తమ్ విజయవంతంగా గోల్ చేశాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు. మొదట 19వ నిమిషంలో అతను చేసిన గోల్‌తో టీమ్ ఇండియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

సెకండాఫ్ ప్రారంభమైన కాసేపటికే 32వ నిమిషంలో జర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. దీంతో భారత్ 3-0తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. అయితే, ఆ తర్వాతి నిమిషంలోనే సౌత్ కొరియా పుంజుకుంది. 33వ నిమిషంలో యాంగ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించాడు. మ్యాచ్‌లో కొరియాకు అదే ఏకైక గోల్. అనంతరం భారత్ కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో కొరియాకు చెక్‌పెట్టింది. దీంతో ఆ జట్టు గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన కొరియా ఆటగాళ్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.

ఇక, 45వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ రెండో గోల్ చేయడంతో భారత్ 4-1తో ఆధిక్యం సాధించింది. ఇక, చివరి 15 నిమిషాల్లో ప్రత్యర్థిని నిలువరించిన భారత్ భారీ విజయం అందుకుని ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ చరిత్రలో ఎదురులేని రికార్డు ఉన్న భారత్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఏడోసారి. అందులో 2011, 2016, 2018, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది. ఈ సారి కూడా టోర్నీలో చాంపియన్‌గా నిలువాలని ఉవ్విళ్లూరుతున్నది. ఈ నెల 17న జరిగే టైటిల్ పోరులో చైనాతో తలపడనుంది. 

Tags:    

Similar News