రఫేల్ నాదల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌‌కు రెడీ

Update: 2023-10-11 16:40 GMT

సిడ్నీ: తుంటి కండరానికి శస్త్రచికిత్స చేయించుకుని కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ మళ్లీ టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతను పాల్గొంటాడని టోర్నమెంట్ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ బుధవారం వెల్లడించారు. ‘రఫా తిరిగి రాబోతున్నాడు. దాదాపు సంవత్సరంపాటు ఆటకు దూరంగా ఉన్న రఫేల్ ఆస్టేలియన్ ఓపెన్‌లో పాల్గొంటాడు. కొన్నిరోజులుగా అతనితో టచ్‌లో ఉన్నాను.

గాయం నుంచి కోలుకుంటున్న అతడు.. టోర్నమెంట్‌లో ఆడతానని ధ్రువీకరించాడు. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం’ అని క్రెయిగ్ వెల్లడించారు. కాగా, 37ఏళ్ల రఫేల్.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతుండగానే రెండో రౌండ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన అతడు.. జూన్‌లో తుంటి కండరానికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగానే ఉన్నాడు. ఇక, రఫేల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న విషయం విదితమే.


Similar News