R Praggnanandhaa : ప్రజ్ఞానంద మరో సంచలనం.. వరల్డ్ నం.2కు షాక్

నార్వే చెస్ టోర్నీలో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు.

Update: 2024-06-02 13:39 GMT

దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు. ఇటీవలే ఇదే టోర్నీలో వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌పై తొలి క్లాసికల్ విజయం అందుకున్న అతను.. తాజాగా వరల్డ్ నం.2 ఫాబియానో కరువానా(అమెరికా)కు షాకిచ్చాడు. ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌లో ఫాబియానో కరువానా‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. తెల్లపావులతో ఆడిన అతను 77 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. వరల్డ్ నం.2 నుంచి గట్టి సవాల్ ఎదుర్కొన్నప్పటికీ ప్రజ్ఞానంద ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గేమ్‌ను దక్కించుకున్నాడు.

మూడో రౌండ్‌లో అతను వరల్డ్ నం.1 కార్ల్‌సన్‌‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు సంచలన విజయాలతో ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం అతను 13 స్థానంలో ఉన్నాడు. అలాగే, ఈ టోర్నీ పాయింట్స్ టేబుల్‌లో ప్రజ్ఞానంద 8.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా సత్తాచాటుతోంది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఆమె 10 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఐదో రౌండ్‌లో ఆమె చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్జీతో కలిసి పాయింట్లు పంచుకుంది. నాలుగో రౌండ్‌లో ఓటమి పాలైన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఐదో రౌండ్‌ను డ్రా చేసుకుంది. జు వెన్జున్(చైనా)తో కలిసి 31 ఎత్తుల్లో డ్రాకు అంగీకరించింది. 

Tags:    

Similar News