Paris Olympics : అంగరంగ వైభవంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచే కొన్ని క్రీడలు ప్రారంభమైనా.. శుక్రవారం అధికారికంగా విశ్వక్రీడలకు తెరలేసింది. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తుండటంతో పారిస్ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓపెనింగ్ సెర్మనీని బహిరంగంగా నిర్వహించారు. ప్రారంభ వేడుకలకు సెయిన్ నది వేదికైంది. ఆస్టర్లిట్జ్ బ్రిడ్ నుంచి మొదలైన పరేడ్ ట్రోకాడెరో వరకు సాగింది. నదిలో 6 కిలో మీటర్ల మేర ఈ పరేడ్ జరిగింది. పరేడ్‌ను వీక్షించేందుకు నదికి ఇరువైపుల, బ్రిడ్జ్‌పై ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నదికి ఇరువైపుల సంగీత ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పరేడ్ ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. వర్షం అంతరాయం కలిగించినా అథ్లెట్లలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. ఓ పెద్ద బౌట్‌లో భారత బృందం పరేడ్‌లో పాల్గొంది. పీవీ సింధు, శరత్ కమల్ పతకధారులుగా వ్యవహరించారు. 78 మంది భారత అథ్లెట్లు, ఇతర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం క్రీడలు ఉన్న నేపథ్యంలో పలువురు ఓపెనింగ్ సెర్మనీకి దూరంగా ఉన్నారు. ప్రారంభ వేడుకలో 85 బోట్లలో 6, 800 అథ్లెట్లు పాల్గొన్నారు.