Paris Paralympics : భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు.. స్వర్ణం సాధించిన షట్లర్ నితేశ్

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాల పంట కొనసాగుతోంది.

Update: 2024-09-02 12:02 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాల పంట కొనసాగుతోంది. మంగళవారం భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ బంగారు పతకం గెలిచాడు. తొలి విశ్వక్రీడల్లోనే అతను పసిడి సాధించడం వివేషం. ఫైనల్‌లో నితేశ్ 21-14, 18-21, 23-21 తేడాతో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డానియల్ బెతెల్‌ను ఓడించాడు. షూటర్ అవనీ లేఖరా ఈ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే.

మరోవైపు, అథ్లెటిక్స్‌లో కూడా మరో పతకం దక్కింది. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్‌56 ఈవెంట్‌లో యోగేశ్ కథునియా రజతం కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో 42.22 మీటర్ల సీజన్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. తొలి ప్రయత్నంతోనే అతను పతకం కొల్లగొట్టాడు. యోగేశ్‌కు ఇది రెండో పారాలింపిక్ మెడల్. టోక్యో పారాలింపిక్స్‌లోనూ అతను రజతం సాధించాడు. ఈ రెండు పతకాలతో భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది.

Tags:    

Similar News