కామన్వెల్త్ గేమ్స్‌లో డోపింగ్‌.. బ్రాంజ్ మెడల్ కోల్పోయిన పాక్ రెజ్లర్

బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్ డోపింగ్‌కు పాల్పడ్డాడు.

Update: 2024-09-03 12:48 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాకిస్తాన్ రెజ్లర్ అలీ అసద్ డోపింగ్‌కు పాల్పడ్డాడు. ప్రదర్శనను మెరుగుపర్చుకోవడానికి అతను నిషేధిత డ్రగ్స్ వాడినట్టు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఐటీఏ) టెస్టులో తేలింది. దీనిపై విచారణ హక్కును వదులుకోవడంతోపాటు నిర్ణీత గడువులోగా స్పందించకపోవడంతో అతనిపై వేటు పడింది. ఐటీఏ నిర్ధారణ ఆధారంగా అలీ అసద్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్టు పాకిస్తాన్ రెజ్లింగ్ ఫెడరేషన్ ధ్రువీకరించింది.

అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో అతను పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ కేటగిరీలో కాంస్యం పతకం గెలుచుకున్నాడు. డోప్ టెస్టులో విఫలమవడం, సస్పెన్షన్ నేపథ్యంలో అలీ అసద్ బ్రాంజ్ మెడల్‌ను కోల్పోయాడు. ఈ మధ్య కాలంలో పాక్ క్రీడల్లో ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ ఉల్లంఘనలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యారు. మేలో పాక్ వెయిట్‌లిఫ్టర్లు అబ్దుర్ రెహ్మాన్, గులామ్ ముస్తాఫా, షర్జీల్ బట్, ఫర్హాన్ అమ్జాద్‌లను ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్‌ నాలుగేళ్లపాటు బ్యాన్ చేసింది. 


Similar News