'మీ దేశం పరువును మీరే తీసుకున్నారు'.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్‌.. వీడియో వైరల్

అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో వంద(100) మీటర్ల స్ప్రింట్‌ రేసుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

Update: 2023-08-02 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో వంద(100) మీటర్ల స్ప్రింట్‌ రేసుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ వంద మీటర్ల స్ప్రింట్‌లో ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పరుగుల చిరుతగా పేరు పొందిన ఉసెన్‌ బోల్ట్‌ వంద మీటర్ల రేసులో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. మహిళల విభాగంలోనూ వంద మీటర్ల స్ప్రింట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాంటి వంద మీటర్ల రేసు ప్రాధాన్యతను పరువు తీసింది సోమాలియాకు చెందిన అథ్లెట్‌ నస్రా అబుకర్‌ అలీ. చైనాలోని చెంగ్డూ వేదికగా 31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా వంద మీటర్ల రేసులో సోమాలియాకు చెందిన అబుకర్‌ అలీ కూడా పాల్గొంది. రేసుకు సిద్ధమైన మిగతా అథ్లెట్లు స్టాన్స్‌కు పొజిషన్‌ ఇవ్వగా.. అబుకర్‌ అలీ మాత్రం కనీసం స్టాన్స్‌ పొజిషన్‌ తీసుకోవడానికి కూడా బద్దకించింది.

ఇక బజర్‌ రింగ్‌ మోగగానే తోటి అథ్లెట్లు రేసును తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించగా.. అబుకర్‌ అలీ మాత్రం స్లోగా పరిగెత్తింది. సరైన ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగిన ఆమె వంద మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21 సెకన్లు తీసుకుంది. రేసు పూర్తి అయిన తర్వాత చిన్నపిల్లలా ట్రాక్‌పై జంప్‌ చేస్తూ వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు దానిని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. సోమాలియా మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ను ఏకిపారేశారు. ''ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు కనీస అవగాహన లేని వ్యక్తిని పంపించడం తప్పు.. సరైన ప్రాక్టీస్‌ లేకుండానే ఆమెను దేశం తరపున బరిలోకి దించడం అవమానం కిందే లెక్క.. మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారు..''అంటూ కామెంట్‌ చేశారు.


Similar News