Asian Games 2023: టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌..

చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్‌ జట్లు తొలిసారి పాల్గొనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-07-18 15:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్‌ జట్లు తొలిసారి పాల్గొనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనే మెన్స్‌, ఉమెన్స్‌ జట్లను బీసీసీఐ ప్రకటించింది. భారత పురుషుల జట్టుకు యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ సారధ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం వహించనుంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్‌, ప్రభుసిమ్రాన్‌ సింగ్‌, తిలక్‌ వర్మ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ఆసియా క్రీడలకు భారత సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు.

ఈ క్రీడలకు సీనియర్‌ ఆటగాళ్లతో పాటు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ ఛీప్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కూడా లక్ష్మణ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించారు. లక్ష్మణ్‌ పర్యవేక్షణలోనే అండర్‌ 19 ప్రపంచకప్‌-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. మరోసారి జట్టును తన నేతృత్వంలో జట్టును నడిపించేందుకు హైదరాబాదీ సిద్దమయ్యాడు. ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 19 నుంచి ఆక్టోబర్‌ 7 వరకు జరగనున్నాయి.


Similar News