ఆసియా కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్

భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు హ్యాట్రిక్ ఆసియా కప్‌పై కన్నేసింది.

Update: 2024-12-03 17:46 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు హ్యాట్రిక్ ఆసియా కప్‌పై కన్నేసింది. ఒమన్‌లో జరుగుతున్న హాకీ పురుషుల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో మలేసియాను చిత్తు చేసి వరుసగా మూడో సారి, మొత్తంగా 7వ సారి ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగే టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇరు జట్లు ఫైనల్‌లో ఎదురుపడటం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.

టోర్నీలో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. గ్రూపు దశను అజేయంగా ముగించగా.. సెమీస్‌లోనూ అదే జోరు ప్రదర్శించింది.మంగళవారం జరిగిన సెమీస్‌లో మలేసియాపై 1-3తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో భారత జట్టు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దిల్‌రాజ్ 10వ నిమిషంలోనే చేసిన గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. అనంతరం 45వ నిమిషంలో రోహిత్, 52వ నిమిషంలో శార్దా గోల్స్ చేయడంతో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా మలేసియా తరపున కమరుద్దీన్ 57వ నిమిషంలో గోల్ చేశాడు. మ్యాచ్‌లో ఆ జట్టుకే అదే ఏకైక గోల్. టోర్నీలో రికార్డు టైటిల్స్(4)తో భారత్‌ ఎదురులేని జట్టుగా ఉన్నది. పాక్‌పై కూడా మంచి భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు ఐదుసార్లు టైటిల్ పోరులో తలపడగా.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఈ సారి కూడా పాక్‌ను చిత్తు చేసి 5వ టైటిల్ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.

Tags:    

Similar News