తండ్రి మెకానిక్, తల్లి నర్సు, పుట్టుకతోనే వైకల్యం.. పారాలింపిక్స్ మెడలిస్ట్ రుబీనా ఫ్రాన్సిస్ సక్సెస్ స్టోరీ ఇదే

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో రుబీనా జన్మించింది.

Update: 2024-08-31 16:24 GMT

దిశ, స్పోర్ట్స్ : తండ్రి మెకానిక్, తల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సు. అందులోనూ పుట్టుకతో కాలు వైకల్యం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి కలలు కనడమే నేరంగా చూస్తారు. అలాంటిది, ఆ అమ్మాయి వైకల్యాన్ని కూడా లెక్కచేయలేదు. షూటింగ్‌నే జీవితమనుకుంది. తండ్రి అండతో తన కల వైపు అడుగులు వేసింది. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను దాటిన ఆమె.. తొలిసారిగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అయితే, అక్కడ ఆ అమ్మాయికి నిరాశ తప్పలేదు. ఆ ఓటమిని మెట్లుగా చేసుకున్న ఆమె పారిస్‌లో మెరిసింది. షూటింగ్‌లో పిస్టల్‌ కేటగిరీలో భారత్‌కు తొలి పారాలింపిక్స్ మెడల్ అందించి చరిత్ర సృష్టించింది. ఆ అమ్మాయే రుబీనా ఫ్రాన్సిస్..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో రుబీనా జన్మించింది. ఆమె తండ్రి సైమన్ ఫ్రాన్సిస్ ఓ మెకానిక్. తల్లి ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో నర్సుగా పనిచేసేది. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబంలో కాలు వైకల్యంతో పుట్టిన రుబీనా చిన్నప్పటి నుంచే సవాళ్లను ఎదుర్కొంది. చదువుతోపాటు ఇంకేదైనా చేయాలని రుబీనా ఆలోచించేది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన గగన్ నారంగ్‌ స్ఫూర్తితో ఆమె షూటింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. ఆమె కలను నిజం చేయడానికి సైమన్ ఫ్రాన్సిస్ చాలా కష్టపడ్డాడు. 2015లో రుబీనా పుణెలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో చేరింది. అక్కడ కోచ్‌ జై ప్రకాశ్‌ ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. ఆయన సూచన మేరకు 2017లో రుబీనా మధ్యప్రదేశ్‌ షూటింగ్ అకాడమీలో చేరింది.

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గిన మను బాకర్‌కు కోచ్‌గా ఉన్న జస్పాల్ రాణా మార్గదర్శకత్వంలోనే రుబీనా కూడా శిక్షణ పొందింది. జస్పాల్ రాణా శిక్షణలో రుబీనా మెరుగుపడింది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 7వ స్థానంతో సరిపెట్టింది. ఆ ఓటమికి కుంగిపోకుండా రుబీనా లక్ష్యం వైపు మరింత ఫోకస్ పెట్టింది. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంది. గతేడాది ఆసియా పారా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. వరల్డ్ కప్ టోర్నీల్లో వివిధ కేటగిరీల్లో 10కిపైగా పతకాలు సాధించింది. 2022లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌, ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణాలు గెలుచుకుంది. ఈ ఏడాది జూలైలో ఆమె పారిస్ పారాలింపిక్స్ బెర్త్ సాధించింది. రుబీనా ఈ సారి పారాలింపిక్స్ పతక కలను నిజం చేసుకుంది. 

Tags:    

Similar News