'యువకులు అరంగేట్రం చేసేనా?'.. రేపు విండీస్‌తో తొలి టెస్ట్

Update: 2023-07-10 16:47 GMT

న్యూఢిల్లీ : వెస్టిండీస్‌ పర్యటనలో పలువురు టీమ్ ఇండియా యువ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. విండీస్‌ టూరు‌లో భాగంగా టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ముఖేశ్ కుమార్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్, గైక్వాడ్ ఇప్పటికే పరిమిత ఓవర్లలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించగా.. టెస్టుల్లో ఎంట్రీ కోసం చూస్తున్నారు. మరోవైపు, యశస్వి జైశ్వాల్, ముఖేశ్ కుమార్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నారు. రేపు విండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసేదెవరో నేడు తేలిపోనుంది.

యశస్వి జైశ్వాల్..

విండీస్‌ పర్యటనలో యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్-16లో అదరగొట్టి సెలెక్టర్ల దృష్టిన ఆకర్షించిన ఈ యువ ఓపెనర్.. టెస్టు జట్టుతోపాటు టీ20 జట్టుకూ ఎంపికయ్యాడు. విండీస్‌తో జరిగే తొలి టెస్టుతోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇటీవల విండీస్ పర్యటనలో టీమ్ ఇండియా ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి జైశ్వాల్ ఓపెనింగ్ వచ్చి రాణించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటి తుది జట్టులో చోటుకు మార్గం సుగుమం చేసుకున్నాడు. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అతన్ని మిడిలార్డర్‌కు పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రోహిత్‌తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

రుతురాజ్ గైక్వాడ్..

వన్డే, టీ20ల తరఫున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రుతురాజ్ గైక్వాడ్ టెస్టు ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే గైక్వాడ్‌ను సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా స్థానంలో జట్టుకు ఎంపిక చేశారు. రోహిత్, గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే గైక్వాడ్‌కు తుది జట్టులో బెర్త్ దక్కేందుకు చాన్స్‌లు ఉన్నాయి. అలా కాకుండా ఓపెనర్‌గా జైశ్వాల్‌ను పంపి.. గిల్‌ను మిడిలార్డర్‌కు దించింతే మాత్రం గైక్వాడ్‌కు చోటు కష్టమే. అదే జరిగితే 3వ స్థానంలో గిల్, 4వ స్థానంలో కోహ్లీ, 5వ స్థానంలో రహానే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

ఇషాన్ కిషన్..

రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితే యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌ది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న అతను ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఇషాన్ కిషన్ మరో వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌తో పోటీపడుతున్నాడు. పంత్ గైర్హాజరు నేపథ్యంలో భరత్ అతన్ని స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. బ్యాటుతో అతను మెరుగైన స్కోరు చేయలేకపోతున్నా కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. భరత్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అవకాశం దక్కనుంది.

ముఖేశ్ కుమార్..

తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న బౌలర్ ముఖేశ్ కుమార్‌కు కూడా అరంగేట్రం చేసే చాన్స్ ఉంది. తొలి టెస్టులో ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌తోపాటు మహ్మద్ సిరాజ్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తున్నది. మరో స్థానం కోసం జయదేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైనీతోపాటు ముఖేశ్ కుమార్ సైతం పోటీపడుతున్నాడు. మరి, ముఖేశ్ కుమార్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇస్తుందో లేదో చూడాల్సిందే.


Similar News