ఆ నలుగురు నా ఫేవరెట్.. వాళ్లతో గంట మాట్లాడినా చాలు : మను బాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత ఏ మాత్రం పట్టుదల వదలకుండా కష్టపడిన ఆమె పారిస్‌లో సత్తాచాటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తాజాగా మను తనకు ఇష్టమైన క్రీడాకారులు ఎవరో చెప్పింది. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, జమైకా లెజెండరీ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ తన ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్స్ అని తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనును తనకు ఇష్టమైన స్పోర్ట్స్ పర్సన్ ఎవరో చెప్పాలని అడిగారు. దానికి మను బదులిస్తూ..‘నాకు చాలా మంది అంటే ఇష్టం. నా ఫేవరెట్ క్రీడాకారుల్లో కొందరి పేర్లే చెబుతా. అందులో ఉసేన్ బోల్ట్ ఉంటాడు. అతని ప్రయాణం నాకు తెలుసు. అతని పుస్తకాన్ని చాలా సార్లు చదివా. బోల్ట్ ఇంటర్వ్యూలు చాలా చూశా.’అని చెప్పింది. అలాగే, ఇండియాలో సచిన్, ధోనీ, కోహ్లీ అంటే ఇష్టమని తెలిపింది. వాళ్లతో ఓ గంట సేపు మాట్లాడే అవకాశం వచ్చినా గౌరవంగా భావిస్తానని చెప్పుకొచ్చింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మహిళల, మిక్స్‌డ్ ఈవెంట్లలో మను కాంస్య పతకాలు సాధించింది. ప్రస్తుతం షూటింగ్ నుంచి విశ్రాంతి తీసుకున్న మను.. తన వ్యక్తిగత అభిరుచులైన గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్, భరతనాట్యంపై ఫోకస్ పెట్టినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.