రోహిత్, కోహ్లీ ఎక్కువ కాలం ఆడలేరు.. వాళ్లకు ఇదే చివరి చాన్స్ : కైఫ్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడానికి బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడానికి బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు. వయసు దృష్ట్యా వారిద్దరూ టీ20 ప్రపంచకప్ గెలవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో కైఫ్ మాట్లాడుతూ.. ‘ఎక్కువ కాలం ఆడనని రోహిత్‌కు తెలుసు. రెండు, మూడేళ్లు మాత్రమే ఆడొచ్చు. కోహ్లీదీ అదే పరిస్థితి. కాబట్టి, వారిద్దరికీ ఇది చివరి అవకాశం.’ అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు గ్రూపు దశలో పెద్దగా పోటీ ఉండదని, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లోనే కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు. ‘గ్రూపు దశలో భారత్‌కు పోటీ చాలా తక్కువ. సెమీస్, ఫైనల్.. ఇవి రెండే కఠిన మ్యాచ్‌లు. ఆ రెండు రోజులకు సిద్ధంగా ఉండటమే రోహిత్ శర్మకు కఠిన పరీక్ష.’ అని తెలిపాడు. కాగా, జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుండగా..5న ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తన మొదట మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాక్‌తో తలపడనుంది.