క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ ఓటమి.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరాటం

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మళ్లీ నిరాశే.

Update: 2025-03-14 17:30 GMT
క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ ఓటమి.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరాటం
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మళ్లీ నిరాశే. ఈ సారి కూడా టైటిల్ లేకుండా భారత షట్లర్లు లేకుండానే ఇంటిదారిపట్టారు. టైటిల్ ఆశలు రేపిన లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్‌లో తన పోరాటాన్ని ముగించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 10-21, 16-21 తేడాతో చైనా క్రీడాకారుడు లి షి ఫెంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ను మట్టికరిపించిన సేన్ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాడు. మొదట ఎటాకింగ్ నైపుణ్యాలతో దూకుడు ప్రదర్శించాడు. కానీ, చైనా ప్లేయర్ తన లయను అందుకుని వరుస పాయింట్లతో చెలరేగాడు. దీంతో పలు తప్పిదాలు చేసిన సేన్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లో పుంజుకుని ఒక దశలో ఆధిక్యంలో నిలిచాడు. కానీ, లి షి ఫెంగ్ వ్యూహాత్మకంగా ఆడి ఒత్తిడి పెంచాడు. దీంతో సేన్ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. 2022లో లక్ష్యసేన్ ఫైనల్‌కు చేరుకున్నా టైటిల్ పోరులో బోల్తా పడి రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు, ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జంటకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో చైనాకే చెందిన లియు-టాన్ ద్వయం చేతిలో 21-14, 21-10 తేడాతో ఓడిపోయింది. లక్ష్యసేన్, గాయత్రి జోడీ ఓటమిపాలవ్వడంతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.


Tags:    

Similar News