IPL 2025: ఒక్క ఐపీఎల్ టైటిల్ నెగ్గని ఆర్సీబీ.. కొత్త కెప్టెన్ రజత్ రాత మారుస్తాడా?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2025-03-14 19:33 GMT
IPL 2025: ఒక్క ఐపీఎల్ టైటిల్ నెగ్గని ఆర్సీబీ.. కొత్త కెప్టెన్ రజత్ రాత మారుస్తాడా?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానగణంలో ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్‌లను ఏమాత్రం తీసిపోదు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఆ జట్టుకు ఒక్కటే లోటు. ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవకపోవడం ఆర్సీబీని ఎప్పటి నుంచే ముల్లులా గుచ్చుతోంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు స్టార్లకు, ప్రతిభకు కొదవలేదు. కానీ, ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రతి సీజన్‌లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ బరిలోకి దిగడం.. తీరా ఉత్త చేతులతోనే రావడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లు టైటిల్ కలను సాకారం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. డుప్లెసిస్‌తో కూడా కాలేదు. ఇప్పుడు యువ కెప్టెన్ రజత్ పటిదార్‌పై ఆ భారం పడింది. మరి, రజత్ అయినా ఆర్సీబీ రాత మారుస్తాడా?..జట్టుకు తొలి టైటిల్ అందిస్తాడా? చూడాలి.

గత సీజన్‌లో బెంగళూరు ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. ఆరంభంలో ఆ జట్టు తేలిపోయింది. 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే నమోదు చేసి ఎలిమినేషన్ అంచున నిలిచింది. ఆ పరిస్థితుల్లో ఆర్సీబీ పుంజుకున్న తీరు అద్భుతం. వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చింది. అయితే, ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌ను బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్‌తోనే ఆరంభించనుంది. ఈ నెల 22న జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. రజత్ ఐపీఎల్‌లో కెప్టెన్‌‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. సారథిగా అతనికున్న అనుభవం కూడా తక్కువే. దేశవాళీలో మధ్యప్రదేశ్‌ను నడిపించిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌‌కు చేర్చాడు. దీంతో ఐపీఎల్‌లో ఆర్సీబీని రజత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరమే. విరాట్ కోహ్లీ ఎలాగూ ఉన్నాడు. రజత్‌ను వెనకుండి నడిపిస్తాడు. జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాల వరకు విరాట్ కీలక పాత్ర పోషిస్తాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

బ్యాటింగే బలం

ఈ సారి కూడా ఆర్సీబీకి బ్యాటింగే ప్రధాన బలం కానుంది. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ 741 రన్స్‌తో అత్యధిక పరుగులు చేశాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో ఫామ్ అందుకుని టచ్‌లో ఉన్నాడు. అలాగే ఫిల్ సాల్ట్‌ను తీసుకుని మరింత బలాన్ని పెంచుకుంది. గతేడాది కోల్‌కతా టైటిల్‌లో గెలవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 435 రన్స్ చేశాడు. స్ట్రైక్‌రేట్ 182 ఉండటం గమనార్హం. కెప్టెన్ రజత్ పటిదార్, దేవ్‌దత్ పడిక్కల్ కూడా తమదైన రోజున మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ వంటి పవర్ హిట్టర్లు కలిగి ఉండటం అదనపు బలం. జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా కూడా ప్రమాదకరమే.

బౌలర్లు ఏం చేస్తారో?

భువనేశ్వర్, జోష్ హేజల్‌వుడ్, యశ్ దయాల్, లుంగి ఎంగిడి, నువాన్ తుషారా, కృనాల్ పాండ్యా‌లతో బౌలింగ్‌ దళం పేపర్‌పై బలంగానే కనిపిస్తున్నది. భువీ కొన్ని సీజన్లుగా తన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. ఈ సారి ఎలా రాణిస్తాడో చెప్పలేం. ఆస్ట్రేలియా పేసర్ హేజల్‌వుడ్, యువ పేసర్ యశ్ దయాల్‌పై జట్టు నమ్మకంగా ఉంది. స్పిన్నర్లు లేకపోవడం ఆర్సీబీకి ప్రధాన బలహీనత. కృనాల్, సుయాశ్ శర్మ మాత్రమే ఉన్నారు. గత సీజన్‌లో కృనాల్ గొప్పగా రాణించలేదు. సుయాశ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్ దళానికి బౌలర్లు కూడా తోడైతే ఆర్సీబీని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా సవాల్‌తో కూడుకున్నదే.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు

రజత్ పటిదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హాజెల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేశ శర్మ, లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సూయశ్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫెర్డ్, నువాన్ తుషారా, మనోజ్ భాండగ, జాకబ్ బెథెల్, దేవ్‌‌దత్ పడిక్కల్, స్వాస్తిక్,లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్.

Tags:    

Similar News