డ్యాన్స్‌తో దుమ్మురేపిన కోహ్లీ, రోహిత్.. దద్దరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)

టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపారు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్ పోర్టు

Update: 2024-07-04 16:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపారు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్ పోర్టు నుండి వాంఖడే స్టేడియం వరకు జరిగిన వరల్డ్ కప్ విజయోత్సవ ర్యాలీ అనంతరం టీమిండియా ప్లేయర్స్ వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం టీ-20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌ సభ్యులను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. దీంతో పాటుగా 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కప్ గెలవడంతో టీమిండియాకు ప్రకటించిన రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందజేసింది. ఈ కార్యక్రమం అనంతరం టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో స్టేడియం మొత్తం తిరుగుతూ అభిమానులను ఉత్సహపరిచారు.

ఈ సందర్భంగా స్టేడియంలో ప్లే అవుతోన్న పాటకు టీమిండియా ప్లేయర్స్ కాలు కదిపారు. ముఖ్యంగా టీ-20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్, విరాట్ జోడీ ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. కోహ్లీ, రోహిత్‌తో పాటు మిగిలిన ప్లేయర్స్ పాండ్యా, అక్షర్ పటేల్, సూర్య, బుమ్రా సైతం కాలు కదిపి స్టేడియంలో ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న అభిమానులకు.. కోహ్లీ, రోహిత్ డ్యాన్స్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తోన్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలతో వాంఖడేను హోరెత్తించారు. టీమిండియా ఆటగాళ్ల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.


Similar News