లక్నోకు గుడ్ న్యూస్.. అతను వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా కుడి తొడ కండరాల గాయంతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టేందుకు అతనికి నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘రాహుల్‌కు ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇచ్చింది. అతను గురువారం లక్నో క్యాంప్‌లో చేరనున్నాడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో రాహుల్‌కు తొడ కండరాల గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. గత నెలలో లండన్‌లో స్పెషలిస్ట్‌ను సంప్రదించిన రాహుల్ గాయానికి ఇంజెక్షన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్‌సీఏలో చేరి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు అతను దూరమవుతాడని వార్తలు వచ్చినా తాజాగా ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇవ్వడంతో అతను లీగ్ ఆరంభం నుంచే అందుబాటులో ఉండనున్నాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లకు అతను కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. కీపింగ్ చేయడం ద్వారా గాయం తిరిగబెట్టే అవకాశం ఉందని ఎన్‌సీఏ సూచించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లకు అతను కేవలం బ్యాటర్‌గానే ఆడనున్నాడు. ఈ నెల 24న రాజస్థాన్‌తో తలపడటం ద్వారా లక్నో ఈ సీజన్‌ను మొదలుపెట్టనుంది.