ఇంగ్లాండ్‌కు వెస్టిండీస్ షాక్.. వన్డే సిరీస్ కైవసం

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ వెస్టిండీస్ వశమైంది.

Update: 2024-11-07 13:52 GMT

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ వెస్టిండీస్ వశమైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో పర్యాటక జట్టుకు షాకిచ్చి 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బార్బడోస్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను విండీస్ బౌలర్లు మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. పర్యాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.

సాల్ట్(74), మౌస్లీ(57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సామ్ కర్రన్(40), ఆర్చర్(38 నాటౌట్), జెమీ ఓవర్టన్(32) కీలక పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫొర్డె 3 వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, షెఫర్డ్ రెండేసి వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. అనంతరం ప్రత్యర్థి నిర్దేశించిన 264 పరుగుల లక్ష్యాన్నివెస్టిండీస్ రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రాండన్ కింగ్(102), కీసీ కార్టీ(128 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కి జట్టును విజయతీరాలకు నడిపించారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో కరేబియన్ జట్టు విజయం 43 ఓవర్లలోనే లాంఛనమైంది. గత నెలలో శ్రీలంక చేతిలో వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయిన వెస్టిండీస్.. ఈ సిరీస్ విజయంతో పుంజుకుంది.

Tags:    

Similar News