ఆ తప్పు చేసిన బుమ్రా.. మందలించిన ఐసీసీ

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా‌ను ఐసీసీ మందలించింది.

Update: 2024-01-29 12:27 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా‌ను ఐసీసీ మందలించింది. హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్ 28 పరుగులతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ ఓలీ పోప్‌ పరుగుకు బుమ్రా అడ్డుతగిలాడు. ఇది ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో బుమ్రా ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. అలాగే, అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

అసలేం జరిగిందంటే.. ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 81వ ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన ఓలీ పోప్ సింగిల్ రన్ తీశాడు. ఈ పరుగు తీసే సమయంలో బుమ్రా బంతి వైపు చూస్తూ కదలడంతో ఓలీ పోప్ రన్‌కు అడ్డుతగిలాడు. ఆటగాడిని అడ్డుకోవడం ఆర్టికల్ 2.12 ప్రకారం ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడం అవుతుంది. ఈ నేరాన్ని బుమ్రా అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. అయితే, 24 నెలల్లో బుమ్రా తొలి తప్పిదంగా పరిగణిస్తూ మందలించింది. అలాగే, ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. దాదాపుగా లెవల్ 1 ఉల్లంఘనకు మ్యాచ్ పీజులో 50 శాతం కోతతోపాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు.

కాగా, తొలి టెస్టులో బుమ్రా 6 వికెట్లతో సత్తాచాటాడు. స్పిన్నర్లకు అనుకూలించిన ఉప్పల్ పిచ్‌పై అతను తన పేస్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో వికెట్లు పడగొట్టిన ఏకైక ఫాస్ట్ బౌలర్ కూడా బుమ్రానే. మిగతా వికెట్లన్నీ స్పిన్నర్ల ఖాతాలోకే చేరాయి. 

Tags:    

Similar News