వరల్డ్ రికార్డు సృష్టించిన భారత షూటర్ దివ్యాన్ష్
ఈజిప్ట్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ దివ్యాన్ష్ సింగ్ పన్వార్ సత్తాచాటాడు.
దిశ, స్పోర్ట్స్ : ఈజిప్ట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్ దివ్యాన్ష్ సింగ్ పన్వార్ సత్తాచాటాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. అంతేకాకుండా, వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఈవెంట్‌లో మొదట క్వాలిఫికేషన్ రౌండ్‌లో దివ్యాన్ష్ 632.4 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్‌లోనూ దివ్యాన్ష్ అదే జోరు కొనసాగించాడు. ప్రతి షూట్‌లోనూ అతను 10 కంటే తక్కువ స్కోరు నమోదు చేయలేదు. ఇటలీ, సెర్బియా షూటర్లను వెనక్కినెట్టిన అతను 253.7 స్కోరుతో టాప్ పొజిషన్‌లో నిలిచి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ స్కోరుతో దివ్యాన్ష్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. మొత్తంగా దివ్యాన్ష్‌కు ఇది 5వ వరల్డ్ కప్ స్వర్ణం. అలాగే, ఈ టోర్నీలో భారత్‌కు రెండో గోల్డ్ మెడల్.
మరో భారత షూటర్ అర్జున్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించినప్పటికీ 166.1 స్కోరుతో 6వ స్థానంతో సరిపెట్టాడు. ఇటలీ షూటర్ డాని సొల్లాజో(251.8), సెర్బియాకు చెందిన లాజర్ కొవాసెవిచ్(230.6) రజతం, కాంస్యం గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఈవెంట్‌లో భారత్‌కు సిల్వర్ మెడల్ దక్కింది. సోనమ్ ఉత్తమ్ 252.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత షూటర్ నాన్సీ 209.5 స్కోరుతో 4వ స్థానంతో సరిపెట్టింది. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరగా.. మెడల్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.