IPL Auction : వేలంలో చాహల్ మాయ.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఐపీఎల్ వేలంలో కొత్త చరిత్ర సృష్టించాడు.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతోంది. గత రికార్డులను బద్దలుకొడుతూ ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌కు భారీ ధర పలికింది. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన భారత స్పిన్నర్‌గా చాహల్ కొత్త చరిత్ర సృష్టించాడు. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన చాహల్‌ను దక్కించుకునేందుకు దాదాపు అన్ని జట్లు ఆసక్తి చూపించాయి. అయితే, హైదరాబాద్, పంజాబ్ మాత్రం పోటాపోటీగా బిడ్ వేశాయి. హైదరాబాద్ రూ.15.75 కోట్ల బిడ్ వేసి వేలాన్ని ఆసక్తికరంగా మార్చగా.. పంజాబ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చాహల్ కోసం రూ. 18 కోట్లు వెచ్చింది. 2022 వేలంలో రాజస్థాన్ చాహల్‌ను రూ. 6.50 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో పోలిస్తే చాహల్‌కు ఈ వేలంలో 177 శాతం ఎక్కువ ధర పలకడం విశేషం. ఐపీఎల్‌లో చాహల్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. పంజాబ్ ఫ్రాంచైజీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, యువ పేసర్ అర్షదీప్ సింగ్‌ను ఆర్‌టీఎం ఉపయోగించి రూ. 18 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది.