AUS vs IND: ఆసీస్ తోక తెంచలేక..భారత బౌలర్ల విలవిల
అస్ట్రేలియా ఇండియా((Australia vs India)AUS vs IND) మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ముగిసింది.
దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియా ఇండియా((Australia vs India) మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 105 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 333 పరుగులకు చేరింది. నాథన్ లియాన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య ఆఖరి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
నాల్గవ రోజు ఆట ప్రారంభంకాగానే ఇండియా ఓవర్ నైట్ స్కోర్ కు మరో 11పరుగులు మాత్రమే జోడించగా, ఆఖరి వికెట్ గా సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి(114)పరుగులకు అవుటయ్యాడు. సిరాజ్ 4పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ వెంటనే ప్రారంభమైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ భారత పేసర్లు బూమ్రా, సిరాజ్ ల దెబ్బకు ఆది నుంచి వరుస వికెట్లు కోల్పోతూ సాగింది. ఒక దశలో 91పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. 148పరుగుల వద్ద లబుషైన్ (70) అవుట్ కాగా, కెప్టెన్ కమిన్స్ 41పరుగులతో రాణించాడు. 173పరుగులకే 9వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ లు ఆదుకుని పదో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విలువైన 55పరుగులు జోడించారు.
ఆసీస్ టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లను కుప్ప కూల్చిన భారత బౌలర్లు చివర్లో తడబడ్డారు. 64.1ఓవర్ వద్డ ఆసీస్ తొమ్మిదవ వికెట్ పడిపోగా, 82ఓవర్లు ముగిసినా 18ఓవర్ల పాటు పదో వికెట్ ను భారత బౌలర్లు పడగొట్టలేకపోవడం గమనార్హం. దానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా తోడవ్వడంతో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఒక వికెట్ సాధించారు. స్టార్క్ రనౌట్ అయ్యాడు. ఐదో రోజు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.