Paris Olympics : క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత మహిళల ఆర్చరీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌‌ను భారత ఆర్చర్లు ఘనంగా మొదలుపెట్టారు.

Update: 2024-07-25 12:24 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌‌ను భారత ఆర్చర్లు ఘనంగా మొదలుపెట్టారు. అధికారిక ప్రారంభానికి ఒక్క రోజు ముందే ఆర్చరీ పోటీలు మొదలయ్యాయి. గురువారం జరిగిన మహిళల ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-4లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. సౌత్ కొరియా(2046) అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాత చైనా(1996), మెక్సికో(1986), భారత్(1983 పాయింట్లు) జట్లు ఉన్నాయి.

భారత్ ముందడుగు వేయడంలో అంకిత భకత్ కీలక పాత్ర పోషించింది. వ్యక్తిగత ఈవెంట్‌లో ఆమె 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. అలాగే, భజన్ కౌర్ 659 పాయింట్లతో, దీపిక 658 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. మొత్తంగా భారత త్రయం 1983 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలవడంతో క్వార్టర్స్ బెర్త్ దక్కింది. టీమ్ ఈవెంట్‌లో ఈ నెల 28న జరిగే క్వార్టర్స్‌లో భారత్.. ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. మరోవైపు, వ్యక్తిగత ఈవెంట్‌లో ఈ నెల 30న తొలి రౌండ్ జరగనుంది. తొలి రౌండ్‌లో అంకిత పొలాండ్ క్రీడాకారిణి వియోలెటా మైజోర్‌ను, భజన్ కౌర్ ఇండోనేషియాకు చెందిన షిఫా కమల్‌‌ను ఎదుర్కోనుండగా.. ఎస్టోనియా ఆర్చర్ రీనా పర్నాట్‌‌తో దీపిక తలపడనుంది. 

Tags:    

Similar News