యువ భారత్ ఆల్‌రౌండ్ షో.. ఐర్లాండ్‌పై భారీ గెలుపు
ఈ జోడీ మూడో వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించింది.
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్‌లో యువ భారత్ అదరగొడుతున్నది. గ్రూపు ఏలో వరుసగా రెండో విజయం సాధించి.. సూపర్ 6 బెర్త్‌కు చేరువైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన టీమ్ ఇండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు చేసింది. ముషీర్ ఖాన్(118) శతకం కదం తొక్కాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. కెప్టెన్ ఉదయ్ సహారన్(75) తన ఫామ్‌ను కొనసాగించాడు. ముషీర్ ఖాన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించింది.ఐర్లాండ్ బౌలర్లలో ఓలివర్ రిలే 3 వికెట్లు, జాన్ మెక్‌నల్లీ 2 వికెట్లతో సత్తాచాటారు. అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను 29.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ చేశారు. డేనియల్ ఫొర్కిన్(27 నాటౌట్) టాప్ స్కోరర్ అంటే ఐర్లాండ్ బ్యాటర్లే ఏ విధంగా తేలిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరు కూడా మెరుగైన స్కోరు చేయలేకపోయారు. ముగ్గురు డకౌటవ్వగా..నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నమన్ తివారి 4 వికెట్లు, సౌమీ పాండే 3 వికెట్ల ప్రదర్శనతో ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. ఆదివారం జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌లో అమెరికాతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో గ్రూపు ఏలో భారత్ 4 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉంది.