ICC Awards : ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రేసులో శ్రేయాంక
భారత మహిళా స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఐసీసీ వార్షిక అవార్డు రేసులో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఐసీసీ వార్షిక అవార్డు రేసులో నిలిచింది. ఈ ఏడాదికి సంబంధించి ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. శనివారం మహిళల, పురుషుల విభాగాల్లో ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీలను ఐసీసీ ప్రకటించింది. మహిళల విభాగంలో అవార్డుకు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అన్నరీ డెర్క్‌సన్, స్కాట్లాండ్‌కు చెందిన సాస్కియా హోర్లీ, ఐర్లాండ్‌కు చెందిన ఫ్రెయా సర్గెంట్‌తోపాటు శ్రేయాంక కూడా అవార్డుకు నామినేట్ అయ్యింది. గతేడాది డిసెంబర్‌లో అరంగేట్రం చేసిన శ్రేయాంక వైట్ బాల్ క్రికెట్‌లో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది. ఒత్తిడిలోనూ నిలకడగా రాణిస్తున్నది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ టోర్నీలో భారత్ కష్టాల్లో ఉన్న సమయాల్లో కీలక ప్రదర్శన చేసింది. 3 వన్డేలు, 16 టీ20ల్లో కలిపి 25 వికెట్లు తీసింది. పురుషుల విభాగంలో గస్ అట్కిన్సన్(ఇంగ్లాండ్), సైమ్ అయూబ్(పాక్), షామర్ జోసెఫ్(వెస్టిండీస్), కామిందు మెండిస్(శ్రీలంక) అవార్డుకు నామినేట్ అయ్యారు. జనవరిలో అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. మిగతా విభాగాల్లో అవార్డులకు నామినీలను ఐసీసీ నేడు, రేపు ప్రకటించనుంది.