గెలిచే మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక.. తొలి టీ20 కివీస్‌దే

సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది.

Update: 2024-12-28 17:14 GMT

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. తొలి టీ20లో విజయం సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. 65 పరుగులకే 5 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును డారిల్ మిచెల్(62), బ్రేస్‌వెల్(59) ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో రాణించారు. 6 వికెట్‌కు వీరు 105 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్‌‌కు మంచి స్కోరు దక్కింది.అనంతరం ఛేదనలో శ్రీలంక 164/8 స్కోరుకే పరిమితమైంది. అయితే, ఆ జట్టుకు దక్కిన శుభారంభం చూస్తే శ్రీలంకదే మ్యాచ్ అనిపించింది. ఓపెనర్ నిశాంక(90) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కుసాల్ మెండిస్(46)తో కలిసి తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. కానీ, కివీస్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ల తర్వాత మిగతా వారిలో ఒక్కరూ కూడా డబుల్ డిజిట్ చేయలేదు. అయితే, నిశాంక ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డెఫీ 3 వికెట్లు, హెన్రీ, ఫౌల్క్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో కివీస్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


Tags:    

Similar News