ఐదో టెస్టుపై పట్టు సాధించిన భారత్.. 255 పరుగుల ఆధిక్యంలో
తొలి రోజు బంతితో ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. రెండో రోజు బ్యాటుతో సత్తాచాటింది.
దిశ, స్పోర్ట్స్ : తొలి రోజు బంతితో ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. రెండో రోజు బ్యాటుతో సత్తాచాటింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డ అదే పిచ్‌పై భారత బ్యాటర్లు దుమ్ములేపారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శతక మోత మోగించడం, అరంగేట్ర బ్యాటర్ దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ రాణించడంతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్‌పై కన్నేసింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లను కోల్పోయి 473 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 135/1 స్కోరుతో రెండో రోజు టీమ్ ఇండియా ఆట కొనసాగించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(110), శుభ్‌మన్ గిల్(110) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు ఈ జోడీ ఏకంగా 171 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్), బుమ్రా(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగుల ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌పై పట్టు సాధించింది.
తొలి సెషన్ వాళ్లిద్దరిదే
మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌ను జైశ్వాల్, రోహిత్ దూకుడుగా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జైశ్వాల్ అవుటైనా గిల్‌తో కలిసి రోహిత్ ఆ జోరును కొనసాగించాడు. రెండో రోజు తొలి సెషన్‌లో ఆట మొత్తం వాళ్లదే. ఇంగ్లాండ్ వ్యూహాలు ఈ జోడీ ముందు ఏ మాత్రం పనిచేయలేదు. ఆ జట్టు ఒక్క వికెట్ కూడా సాధించలేదంటే రోహిత్, గిల్ ఏ విధంగా ప్రత్యర్థి బౌలర్ల వెన్నువిరిచారో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు రోహిత్ బౌండరీలు బాదగా.. తానేం తక్కువ కాదంటూ మరో ఎండ్‌లో గిల్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో తొలి రోజే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ టెస్టుల్లో 12వ శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే గిల్ సైతం సెంచరీ బాదేశాడు. అతనికి ఇది 4వ టెస్టు శతకం. రెండో వికెట్‌కు ఈ జోడీ 171 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. తొలి సెషన్ విరామం తర్వాత కాసేపటికే స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్(103)బౌల్డ్ అవడంతో ఈ జోడీకి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే గిల్(110)ను అండర్సన్ అవుట్ చేశాడు.
రెండో సెషన్‌లో సర్ఫరాజ్, పడిక్కల్ జోరు
రోహిత్, గిల్ దూకుడును రెండో సెషన్‌లో సర్ఫరాజ్ ఖాన్, పడిక్కల్ కొనసాగించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకపోవడంతో రోహిత్, గిల్‌లను అవుట్ చేసిన ఆనందం ఇంగ్లాండ్‌కు ఎంతో సేపు లేదు. అరంగేట్ర ప్లేయర్ పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పడిక్కల్ కాస్త నిదానంగా ఆడినా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన శైలిలో వన్డే తరహాలో బ్యాట్ ఝుళిపించాడు. దీంతో చూస్తుండగానే అతను వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో భారత్ మరో వికెట్ నష్టపోకుండా 376/3 స్కోరుతో నిలిచింది.
చివరి సెషన్‌లో తడబాటు
చివరి సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా షోయబ్ బషీర్ కీలక వికెట్లు తీసుకున్నాడు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. సెషన్ ఆరంభంలోనే సర్ఫరాజ్ ఖాన్(56)ను అవుట్ చేసిన బషీర్.. కాసేపటికే పడిక్కల్(65)ను కూడా పెవిలియన్ పంపాడు. రవీంద్ర జడేజా(15), ధ్రువ్ జురెల్(15), అశ్విన్(0) నిరాశపర్చడంతో భారత్ 52 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆఖర్లో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్), జస్ప్రిత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతూ రెండో రోజును ముగించారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 218 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 473/8(120 ఓవర్లు)
జైశ్వాల్(స్టంఫ్)ఫోక్స్(బి)షోయబ్ బషీర్ 57, రోహిత్(బి)స్టోక్స్ 103, గిల్(బి)అండర్సన్ 110, దేవదత్ పడిక్కల్(బి)షోయబ్ బషీర్ 65, సర్ఫరాజ్ ఖాన్(సి)రూట్(బి)షోయబ్ బషీర్ 56, జడేజా ఎల్బీడబ్ల్యూ(బి)టామ్ హార్ట్లీ 15, ధ్రువ్ జురెల్(సి)డక్కెట్(బి)షోయబ్ బషీర్ 15, అశ్విన్(బి)టామ్ హార్ట్లీ 0, కుల్దీప్ యాదవ్ 27 బ్యాటింగ్, బుమ్రా 19 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 6.
వికెట్ల పతనం : 104-1, 275-2, 279-3, 376-4, 403-5, 427-6, 427-7, 428-8
బౌలింగ్ : అండర్సన్(14-1-59-1), మార్క్‌వుడ్(15-1-89-0), టామ్ హార్ట్లీ(39-3-126-2), షోయబ్ బషీర్(44-5-170-4), బెన్ స్టోక్స్(5-1-17-1), జోరూట్(3-0-8-0)