ఫిఫా వరల్డ్ కప్-2026కి అర్జెంటీనా అర్హత
యూరోపియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా నుంచి జట్లు అర్హత సాధించాల్సి ఉంది. 2026 మార్చి 31లోగా 48 జట్లను ఫిఫా అర్హతలోకి తీసుకోనుంది.

- CONMEBOLలో చివరి స్పాట్ అర్జెంటీనాదే
- క్వాలిఫయర్ మ్యాచ్‌లో డ్రా చేసుకున్న ఉరుగ్వే, బొలీవియా
దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం జరిగిన CONMEBOL (దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్) క్వాలిఫయర్స్ రౌండ్ 13 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఉరుగ్వే, బొలీవియా మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగియడంతో వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 48 జట్లలో ఆటోమెటిక్‌గా అర్హత సాధించిన జట్లలో అర్జెంటీనా ఉండటం గమనార్హం. ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలు అమెరికా, కెనడా, మెక్సికోలు అర్హత సాధించాయి. వీటికి తోడు జపాన్, ఇరాన్, న్యూజీలాండ్ జట్లు క్వాలిఫై అయ్యాయి. తాజాగా అర్జెంటీనా కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ అర్హత ప్రక్రియ అయిన రన్-ది-గాంట్లెట్ టోర్నీలో ఆరు జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. అయితే ఆసియాలో టాప్ ర్యాంక్‌లో ఉన్న జపాన్ ఇప్పటికే వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆతిథ్య దేశంగా లేకుండా నేరుగా అర్హత సాధించిన జట్టుగా జపాన్ నిలిచింది. ఇక ఏఎఫ్‌సీ నుంచి అర్హత సాధించిన రెండో జట్టుగా ఇరాన్ నిలిచింది. ఏఎఫ్‌సీ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉండటంతో ఇరాన్‌కు అవకాశం లభించింది. ఓషియానిక్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ నుంచి ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్టుగా న్యూజీలాండ్ నిలిచింది. ఇది ఆ జట్టుకు తొలి డైరెక్ట్ ఎంట్రీ కావడం గమనార్హం. తాజాగా దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ నుంచి అర్జెంటీనా అర్హత సాధించింది. వీటితో పాటు యూరోపియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా నుంచి జట్లు అర్హత సాధించాల్సి ఉంది. 2026 మార్చి 31లోగా 48 జట్లను ఫిఫా అర్హతలోకి తీసుకోనుంది.