IPL 2025 : నేడు ఢిల్లీతో హైదరాబాద్ ఢీ.. గత మ్యాచ్ ఓటమి నుంచి ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకుంటుందా?

ఐపీఎల్-18ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.

Update: 2025-03-29 19:51 GMT
IPL 2025 : నేడు ఢిల్లీతో హైదరాబాద్ ఢీ.. గత మ్యాచ్ ఓటమి నుంచి ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకుంటుందా?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. అయితే, రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అదే జోరును కొనసాగించలేకపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. ప్రత్యర్థి ముందు 191 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. నేడు విశాఖపట్నం వేదికగా తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని హైదరాబాద్ భావిస్తున్నది.

బౌలింగ్‌లో మెరుగుపడాల్సిందే

హైదరాబాద్ బ్యాటింగ్ దళానికి ఢోకా లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో హెడ్, నితీశ్, క్లాసెన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ నిరాశపర్చడం ద్వారా జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. అయితే, వారి సామర్థ్యంపై అనుమానాలు లేవు. లక్నోపై యువ బ్యాటర్ అనికేత్ కూడా అద్భుతంగా రాణించాడు. 13 బంతుల్లో 36 రన్స్ చేశాడు. ఒకరకంగా హైదరాబాద్ 190 రన్స్ చేసిందంటే కారణం అతనే. అయితే, హైదరాబాద్ బౌలింగ్ పరంగా మెరుగుపడాల్సిందే. తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు చేసినా గెలుపు కోసం కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. రాజస్థాన్ 241 పరుగులతో గట్టి పోటీచ్చిందంటే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల వైఫల్యమే కారణం. ఇక, లక్నోతో 191 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. పేపర్‌పై షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, కమిన్స్‌ వంటి స్టార్ బౌలర్లతో హైదరాబాద్ బలంగానే ఉన్నా.. ప్రదర్శన మాత్రం ఆ స్థాయిలో లేదు. బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ వంటి బలమైన బ్యాటింగ్ దళం ఉన్న జట్టును ఎదుర్కోవడం హైదరాబాద్‌కు సవాల్‌తో కూడుకున్నది. లక్నోపై విజయంతో డీసీ ఆత్మవిశ్వాసంతో ఉన్నది. వైజాగ్ హోం గ్రౌండ్ కావడం ఆ జట్టుకు మరింత బలం కానుంది. స్టబ్స్, అశుతోష్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. జేక్ ఫ్రేజర్ గుర్క్, డుప్లెసిస్, అభిషేక్ పొరెల్ కూడా ప్రమాదకరమే. కాబట్టి, బౌలర్లు రాణించడంపైనే హైదరాబాద్ విజయం ఆధారపడి ఉన్నది.

ఎస్‌ఆర్‌హెచ్ 13.. ఢిల్లీ 11

ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో హైదరాబాద్‌ కాస్త పైచేయిలో ఉంది. ఇరు జట్లు మొత్తం 24 మ్యాచ్‌ల్లో ఎదురుపడగా ఎస్‌ఆర్‌హెచ్ 13 విజయాలు నమోదు చేసింది. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది.

Tags:    

Similar News