మూడో టీ20లో భారత్ గెలుపు.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. సిరీస్ సమం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది.

Update: 2024-07-09 16:45 GMT

దిశ, స్పోర్ట్స్ : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఆఖరి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో టీ20 సిరీస్‌ను 1-1తో ఇరు జట్లు పంచుకున్నాయి. చెన్నయ్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలింగ్‌లో తేలిపోయారు. 17.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. బ్రిట్స్(20) టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. పూజ(4/13), రాధా(3/6) బంతితో విజృంభించి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. స్మృతి మంధాన(54 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో 10.5 ఓవర్లలోనే విజయం వరించింది. ఆమెకు షెఫాలీ వర్మ(27 నాటౌట్) సహకరించింది. టీ20 సిరీస్ టై అవ్వగా.. అంతకుముందు వన్డే సిరీస్, ఏకైక టెస్టులను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

సఫారీలు విలవిల

అంతకుముందు భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు తేలిపోయారు. ముఖ్యంగా పూజ పేస్‌తో, రాధా స్పిన్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. దీంతో సఫారీలు మొదటి నుంచే తడబడ్డారు. కెప్టెన్ వొల్వార్డ్ట్(9)ను అవుట్ చేయడంతో శ్రేయాంక సౌతాఫ్రికా పతనానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు తీస్తూనే ఉంది. తాజ్‌మిన్ బ్రిట్స్(20) టాప్ స్కోరంటే ఆ జట్టు బ్యాటర్లు ఏ విధంగా చేతుల్తేశారో అర్థం చేసుకోవచ్చు. బ్రిట్స్, కాప్(10), అన్నేకే బోష్(17) రెండెంకల స్కోరు చేయగా.. మిగతా వారిలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో ఇద్దరు ఖాతా కూడా తెరవలేదు. దీంతో ఆ జట్ట ఆట 17.1 ఓవర్లలోనే ముగిసింది. భారత బౌలర్లలో పూజ నాలుగు, రాధా 3 వికెట్లతో సత్తాచాటగా.. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మలకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

సౌతాఫ్రికా మహిళల ఇన్నింగ్స్ : 84 ఆలౌట్(17.1 ఓవర్లు)

వొల్వార్డ్ట్(సి)అరుంధతి(బి)శ్రేయాంక 9, బ్రిట్స్(సి)హర్మన్‌ప్రీత్(బి)దీప్తి 20, మారిజన్నె కాప్(సి)షెఫాలీ(బి)పూజ 10, అన్నెకే బోష్ ఎల్బీడబ్ల్యూ(బి)పూజ 17, ట్రయోన్(సి)రాధా(బి)అరుంధతి 9, నాడిన్ డె క్లర్క్(బి)పూజ 0, డర్క్సెన్ ఎల్బీడబ్ల్యూ(బి)రాధా 2, సినాలో జఫ్టా(సి)అరుంధతి(బి)రాధా 8, ఎలిజ్ మారి మార్క్స్(సి)ఉమా(బి)పూజ 7, మ్లాబా(సి)సజన(బి)రాధా 0, ఆయబొంగ ఖాక 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 2.

వికెట్ల పతనం : 19-1, 30-2, 45-3, 61-4, 61-5, 65-6, 75-7, 84-8, 84-9, 84-10

బౌలింగ్ : పూజ(3.1-0-13-4), సజన(1-0-11-0), అరుంధతి(3-0-14-1), శ్రేయాంక(3-0-19-1), రాధా(3-1-6-3), దీప్తి(4-0-21-1)

భారత్ మహిళల ఇన్నింగ్స్ : 88/0(10.5 ఓవర్లు)

షెఫాలీ 27 నాటౌట్, స్మృతి మంధాన 54 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

బౌలింగ్ : ఆయబొంగ ఖాక(2-0-20-0), కాప్(2-0-3-0), ట్రోయన్(2-0-8-0), ఎలిజ్ మారి మార్క్స్(1-0-11-0), మ్లాబా(2-0-20-0), నాడిన్ డె క్లర్క్(1.5-0-22-0)


Similar News