ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ.. ఫైనల్‌కు అఫ్గాన్..ఇంటికి భారత్!
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు అఫ్గాన్ ‘ఎ’ జట్టు దూసుకెళ్లింది. సెమీఫైనల్-2లో భారత్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
దిశ, స్పోర్ట్స్ : ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు అఫ్గాన్ ‘ఎ’ జట్టు దూసుకెళ్లింది. సెమీఫైనల్-2లో భారత్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు సాధించగా.. లక్ష్య ఛేదనలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమన్‌దీప్ (48), ఆయుష్ (31) రాణించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక భారత్ ‘ఎ’ జట్టు ఇంటిదారి పట్టింది. ఇక ఫైనల్‌లో అఫ్గాన్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.
రమణ్ దీప్ సింగ్ చెలరేగినా..
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 25 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (7) క్యాచ్ ఔట్ అవ్వగా.. తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ ప్రభుసిమ్రన్ సింగ్ (19 : రెండు ఫోర్లు, ఒక సిక్స్) 4.2 ఓవర్ల వద్ద ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే తిలక్ వర్మ (16) సైతం వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత నేహల్ వధేరాతో కలిసి అయుష్ బదోని (31 : 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. 10వ ఓవర్ చివరి బంతికి వధేరా ఔటయ్యే సమయానికి.. భారత్ స్కోర్ 10 ఓవర్లలో 80 పరుగులు సాధించింది. మరో 20 పరుగుల తర్వాత 13 ఓవర్లలో బదోని వెనుదిరిగాడు. 15 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులతో నిలిచింది. 30 బంతుల్లో 85 పరుగులు కావాల్సి ఉండగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రమణ్‌దీప్ సింగ్ ( 64 : 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయినప్పటికీ, భారత్ 20 పరుగులతో ఓటమిపాలైంది.
ఓపెనర్లే బలం..
అంతకుముందు, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అటల్ (83 / 52), జుబైద్ అక్బరి (64/41), కరీమ్ జనత్ (41) చెలరేగి ఆడారు. ఇక భారత్ బౌలర్లలో రసిఖ్ దార్ సేలం 3 వికెట్లు పడగొట్టగా.. ఆకిబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.