భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేటి నుంచే

వెస్టిండీస్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది.

Update: 2023-08-03 09:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు(గురువారం) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఐపీఎల్ స్టార్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫైనల్లో విధ్వంసకర సెంచరీ బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పూరన్‌ ఒక్కడే కాదు.. కైల్‌ మేయర్స్‌, రోమన్‌ పావెల్‌, హెట్‌మయర్‌, హోల్డర్‌, రోస్టన్‌ చేజ్‌, ఒడియన్‌ స్మిత్‌, రొమారియో షెఫర్డ్‌‌లతో వెస్టిండీస్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. వీరిలో హెట్‌మయర్‌ మినహా అందరూ ఆల్‌రౌండర్లే కావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

నిమిషాల్లో మ్యాచ్‌ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్‌ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి తొలి టీ20లో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుంది. 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తరోబా వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కారణంగా కొన్ని ఓవర్ల ఆట నష్టపోయే అవకాశం ఉంది. తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న బ్రయాన్‌ లారా స్టేడియంలోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. భారత్‌, విండీస్‌ చివరి వన్డే జరిగింది ఇక్కడే. టీమిండియా బ్యాటర్లు జట్టుకు 350 పైచిలుకు స్కోరు సాధించిపెట్టారు. బౌలర్లకు కూడా పిచ్‌ నుంచి సహకారం ఉంటుంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అవకాశముంటుంది.


Similar News