మూడో టెస్టులో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టు ఇదే

రాజ్‌కోట్ టెస్టుకు ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది.

Update: 2024-02-14 12:03 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత గడ్డపై టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. వైజాగ్ టెస్టులో టీమ్ ఇండియా గెలుపొంది సిరీస్ 1-1తో సమం చేసింది. రేపటి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రాజ్‌కోట్ ఆతిథ్యమిస్తున్నది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. మూడో టెస్టుకు కూడా అదే ఫాలో అయిన ఇంగ్లాండ్ బుధవారమే తమ జట్టును వెల్లడించింది.

మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టులో ఒక్క మార్పు మినహా రెండో టెస్టు ఆడిన జట్టే రాజ్‌కోట్ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నది. స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో పేసర్ మార్క్‌వుడ్‌ను జట్టులోకి తీసుకుంది. మొదటి టెస్టు ఆడిన మార్క్‌వుడ్‌ను వైజాగ్ మ్యాచ్‌కు పక్కనపెట్టి బషీర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. రెండో టెస్టులో అతను 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే, మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ తమ బౌలింగ్ దళంలో మార్పులు చేయాలని భావించింది. అందుకే స్పిన్నర్ బషీర్‌ స్థానంలో పేసర్ మార్క్‌వుడ్‌ను తీసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఏకైక పేసర్‌తోనే బరిలోకి దిగిన ఆ జట్టు.. రాజ్‌కోట్ మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆడనుంది. జోరూట్ కూడా స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నాడు. రాజ్‌కోట్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్ పిచ్‌ల మాదిరిగానే రాజ్‌కోట్ పిచ్‌పై స్పిన్నర్లు బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో స్పిన్ పిచ్‌లపై పేసర్లు కూడా రాణించడంతోనే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బౌలింగ్ దళంలో ఇద్దరు పేసర్లను చేర్చినట్టు తెలుస్తోంది.

ఇంగ్లాండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్.

Tags:    

Similar News