రెండో టెస్టులో భారత్ ఘన విజయం..
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్ డెస్క్: భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ తర్వాత 399 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భారత్ 255 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా నాలుగో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు వేగంగా ఆడారు. దీంతో భారీ స్కోర్ రాబట్టినప్పటికి ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. భారత బౌలర్ అశ్విన్, బుమ్రా దాటికి కీలక ప్లేయర్లు కుప్పకూలారు. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు అశ్విన్ 3, బుమ్రా 3, ముఖేశ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ రెండో టెస్టులో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. కాగా మూడో టెస్ట్ గుజరాత్ లోని రాజ్ కోటలోని సౌరాష్ట్ర స్టేడియంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగనుంది.