IND Vs BAN: 146 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్.. భారత్ విజయ లక్ష్యం ఎంతంటే?

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది.

Update: 2024-10-01 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో డ్రాగా ముగుస్తుందని అనుకున్న మ్యాచ్ అనూహ్యంగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. భారత బౌలర్ల పేసర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా జట్టులో కేవలం మోమినుల్‌ హక్‌ ఒక్కడే (107) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు 3.. ఆకాశ్‌దీప్, అశ్విన్‌, సిరాజ్‌లకు రెండేసి వికెట్లను తీశారు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్లలోనే 285/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జైస్వాల్‌ (51 బంతుల్లో 72), రాహుల్‌ (43 బంతుల్లో 68), విరాట్‌ (35 బంతుల్లో 47), గిల్‌ (39) పరుగులు చేశారు. అయితే, టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు టీ20 తరహాలో బ్యాటింగ్ చేయడం అందరిని ఆకట్టుకుంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 52 పరుగుల ఆధిక్యం దక్కింది.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు 2 వికెట్లను కోల్పోయి 26 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదో రోజు బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్లు వరుసగా వికెట్లను కోల్పోయారు. సిన్నర్లు అశ్విన్, జడేజా ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ షద్‌మన్ ఇస్లాం 50 పరుగులు, ముష్ఫికర్ రహీం 37 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్లు అంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరోవైపు బుమ్రా కూడా నిప్పులు చెరిగే బంతులతో విచుకుపడటంతో బంగ్లా జట్టు 146 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో భారత్ 95 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుతం 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా 80 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (40 బంతుల్లో 42 పరుగు), విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 19 పరుగులు) చేసి క్రీజ్‌లో ఉన్నారు. విజయానికి మరో 15 పరుగుల దూరంలో టీమిండియా ఉంది.       


Similar News