మళ్లీ బ్యాటు పట్టబోతున్న సచిన్.. ఆ టోర్నీలో బరిలోకి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాటు పట్టబోతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాటు పట్టబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ప్రారంభ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎంఎల్) టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఐఎంఎల్‌ను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో కలిసి సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..‘టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. మాజీ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌లో ఆడాలని ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. క్రీడాకారులు ఎప్పటికీ రిటైర్ అవ్వరు. మైదానంలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తుంటారు.’ అని తెలిపాడు.
ఈ లీగ్ కమిషనర్‌గా సునీల్ గవాస్కర్ నియామకమయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆరు దేశాల(భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక) మాజీ క్రికెటర్లు పాల్గొననున్నారు. ఈ ఏడాది చివర్లో లీగ్ జరిగే అవకాశం ఉండగా.. షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున 664 మ్యాచ్‌లు ఆడిన అతను అన్ని ఫార్మాట్లో కలిపి 34,357 పరుగులు చేశాడు. వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది.