ICC World Cup 2023: ‘మీ చెత్త బుద్ధి చూపెట్టారు’.. పీసీబీ చైర్మన్‌పై నెటిజన్స్ ఫైర్

భారత్‌ను శత్రుదేశంగా అభివర్ణిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ జాకా అష్రాఫ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

Update: 2023-09-29 14:34 GMT

న్యూఢిల్లీ : భారత్‌ను శత్రుదేశంగా అభివర్ణిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ జాకా అష్రాఫ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అష్రాఫ్‌పై భారత అభిమానులు మాత్రమే కాదు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ జట్టు బుధవారం హైదరాబాద్‌కు చేరుకుగా.. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తమకు దక్కిన స్వాగతం పట్ల పాక్ క్రికెటర్లు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో పీసీబీ చైర్మన్ జాకా అష్రాఫ్ మాత్రం భారత్‌పై విషంకక్కాడు. పాక్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ కార్యక్రమంలో అష్రాఫ్ మాట్లాడుతూ.. ‘ప్రేమ, ఆప్యాయతతో మా ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్‌లు ఇచ్చాం.

పాక్ క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు అందజేయలేదు. టోర్నీల కోసం ఇతర దేశాలకు, శత్రు దేశానికి వెళ్లే పాక్ క్రికెటర్లలో ఉత్సాహం నింపడమే నా లక్ష్యం.’ అని తెలిపాడు. అష్రాఫ్ పరోక్షంగా భారత్‌ను శత్రుదేశం అనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెటర్లు ప్రస్తుతం ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించడం మినహా మరే ఏ టోర్నీ ఆడటం లేదు. ‘భారత్‌లో పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. మీరు మాత్రం భారత్‌పై విషంకక్కుతూ మీ చెత్త బుద్ధిని చూపెట్టారు’ అని ఫైర్ అవుతున్నారు. భారత అభిమానులే కాకుండా పాక్ ఫ్యాన్స్‌ సైతం అష్రాఫ్‌పై మండిపడుతున్నారు. ‘భారత్‌ మాకు శత్రుదేశం కాదు. అష్రాఫే మా జట్టుకు శత్రువు’ అని పాక్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. కాగా, తన వ్యాఖ్యలపై అష్రాఫ్ స్పందించాడు. తాను భారత్‌ను శత్రుదేశంగా చెప్పలేదని, క్రికెట్‌లో సాంప్రదాయక ప్రత్యర్థులు అన్నానని మాటమార్చాడు.


Similar News