వన్డే, టీ20ల్లో భారత్ టాప్.. టెస్టుల్లో షాక్
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ వార్షిక టీమ్ ర్యాంకింగ్స్‌ను శుక్రవారం విడుదల చేయగా.. వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియానే అగ్రస్థానంలో నిలిచింది. వన్డేల్లో 122 పాయింట్లతో భారత్ టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ టీమ్ ఇండియా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆస్ట్రేలియా(116), సౌతాఫ్రికా(112), పాకిస్తాన్(106), న్యూజిలాండ్(101) టాప్-5లో ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో 264 పాయింట్లతో భారత్‌దే అగ్రస్థానం. ఆస్ట్రేలియా(257) ఒక్క స్థానం, సౌతాఫ్రికా(250) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 2వ, 4వ ర్యాంక్‌ల్లో నిలిచాయి. ఇంగ్లాండ్(252), న్యూజిలాండ్(250) చెరో స్థానం కోల్పోయి 3వ, 5వ స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు, టెస్టుల్లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. గతేడాది వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఓటమి ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. డబ్ల్యూటీసీ చాంపియన్ ఆసిస్(124) భారత్‌ను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. టీమ్ ఇండియా(120) రెండో స్థానంలో ఉండగా.. ఆసిస్‌కు 4 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నది. ఇంగ్లాండ్(105), సౌతాఫ్రికా(103), న్యూజిలాండ్(96) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.