ICC ODI Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు..
తాజాగా విడుదల చేసిన ICC ODI Rankingsలో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు.
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా విడుదల చేసిన ICC ODI Rankingsలో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. ముగ్గురు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 154 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు సాధించగా.. ఇదే ఆసియా కప్‌లో పాక్‌పై సూపర్ సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ సైతం రెండు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో ప్లేస్‌కు చేరుకున్నాడు.
గడిచిన ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2019 జనవరిలో చివరిసారి ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నాడు శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ర్యాంకింగ్స్‌లో భారత్‌తో పాటు పాక్‌కు చెందిన ఆటగాళ్లు కూడా ముగ్గురు టాప్-10లో ఉండటం విశేషం. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విషయానికొస్తే.. భారత టాప్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శన (పాక్‌పై 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు) కారణంగా ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తన తొమ్మిదో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా సిరీస్ రాణిస్తున్న జోష్ హాజిల్‌వుడ్ ఫస్ట్ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. మిచెల్ స్టార్క్, కివీస్ పేస్ గన్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో సంయుక్తంగా నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో.. ఫస్ట్ ప్లేస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్, భారత్‌ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఆసీస్, పాక్‌లు చెరి 118 పాయింట్లతో 1, 2 స్థానాల్లో కొనసాగుతుండగా.. 116 పాయింట్లతో టీమిండియా మూడో ప్లేస్‌లో నిలిచింది.