ICC Champions trophy : ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ క్యాన్సిల్

పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లో నేడు(సోమవారం) జరగాల్సిన కార్యక్రమాన్ని ఐసీసీ రద్దు చేసింది.

Update: 2024-11-10 13:37 GMT

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లో సోమవారం జరగాల్సిన కార్యక్రమాన్ని ఐసీసీ రద్దు చేసింది. టోర్నమెంట్ షెడ్యూల్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం, ఇండియా పాకిస్తాన్ పర్యటనకు నో చెప్పడంతో 8 జట్లు పాల్గొనే టోర్నమెంట్ నిర్వహణలో సందిగ్ధం నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 19 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. షెడ్యూల్ రిలీజ్, వంద రోజుల కౌంట్ డౌన్ ఈవెంట్ రద్దయింది. భారత్ పాకిస్తాన్ లో పర్యటనకు ‘నో’ చెప్పడంతో షెడ్యూల్ అంశమై పాకిస్తాన్‌, టోర్నీలో పాల్గొనే జట్లతో చర్చిస్తున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ‘షెడ్యూల్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఆతిథ్య జట్టు, టోర్నీలో పాల్గొనే దేశాలతో షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. చర్చలు ముగిసిన తర్వాత షెడ్యూల్ ఎప్పుడు అన్నది వెల్లడిస్తామని ఐసీసీ అధికారి తెలిపారు. లాహోర్‌లో దట్టమైన పొగమంచు, భారత్ పాక్ పర్యటనకు ‘నో’ చెప్పడం వంటి అంశాలతో ఈవెంట్ రద్దయినట్లు తెలుస్తోంది. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ.. భారత్ ఈ అంశమై ఎలాంటి రాతపూర్వక లేఖ ఇవ్వలేదన్నాడు. హైబ్రిడ్ మోడల్ గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. తొలుత షెడ్యూల్ చేసిన ప్రకారం భారత్ బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న, న్యూజిలాండ్‌తో 23న, పాకిస్తాన్ మార్చి 1న తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లకు లాహోర్‌ను వేదికగా ఎంచుకున్నారు.  

Tags:    

Similar News