రోహిత్, కోహ్లీలను కాపీ కొట్టను.. నా స్టైల్‌లో కెప్టెన్సీ చేస్తా : బుమ్రా
తన స్టైల్‌లో జట్టును నడిపిస్తానని, ఇతరుల కంటే తన కెప్టెన్సీ భిన్నింగా ఉంటుందని స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : తన స్టైల్‌లో జట్టును నడిపిస్తానని, ఇతరుల కంటే తన కెప్టెన్సీ భిన్నింగా ఉంటుందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తెలిపాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ దూరంగా ఉండటంతో జట్టును బుమ్రా నడిపించనున్నాడు. పెర్త్ మ్యాచ్‌కు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా పలు విషయాలు వెల్లడించాడు. ‘కెప్టెన్సీని ఓ పదవిలో చూడను. బాధ్యతగా ఇష్టపడతాను. కెప్టెన్సీ ఓ గౌరవం. చిన్నప్పటి నుంచి కష్టమైన పనులు చేయాలని చూస్తా. ఇప్పుడు ఇది కొత్త సవాల్. రోహిత్, కోహ్లీల నుంచి నేర్చుకున్నా. కానీ, నా శైలి భిన్నంగా ఉంటుంది. గుడ్డిగా ఎవరినీ కాపీ కొట్టను. నా సామర్థ్యం, ధైర్యాన్ని విశ్వసిస్తాను.’ అని తెలిపాడు. అలాగే, పేసర్లు కెప్టెన్లు ఉండాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని చెప్పాడు. ‘సారథిగా పేసర్లు వ్యూహాత్మకంగా బెటర్. పాట్ కమిన్స్ ఆసిస్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కపిల్ దేవ్ సహా చాలా మంది గతంలో కెప్టెన్లుగా ఉన్నారు. కొత్త సంప్రదాయం మొదలవుతుందని ఆశిస్తున్నా.’ అని తెలిపాడు. తొలి టెస్టుకు తుది జట్టు ఖరారైందని, మ్యాచ్‌కు ముందు ప్రకటిస్తామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. సిరీస్‌కు 10 రోజుల ముందే రావడం ద్వారా సన్నద్ధతకు సమయం దొరికిందన్నాడు.
కివీస్ ఓటమిని మాతో తెచ్చుకోలేదు
న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమిపై బుమ్రా మాట్లాడుతూ..‘భారత్ నుంచి కివీస్‌తో ఓటమి నిరుత్సాహాన్ని మాతో తెచ్చుకోలేదు. మీరు ఒక సిరీస్‌లో గెలిచినా, ఓడినా ఆ తర్వాతి సిరీస్‌లో మొదటి నుంచి మొదలుపెట్టాల్సిందే. న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నాం. కానీ, అవి భిన్నమైన పరిస్థితులు. మా ఫలితాలు కూడా భిన్నంగానే ఉంటాయి.’ అని చెప్పాడు.
కోహ్లీపై అనుమానాలు అక్కర్లేదు
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి బుమ్రా మద్దతుగా నిలిచాడు.‘ఒకటి లేదా రెండు సిరీస్‌లు కిందికి మీదికి అవ్వొచ్చు. కోహ్లీపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. మెంటల్‌గా అతను సిద్ధంగా ఉన్నాడు. బ్యాటర్‌గా కోహ్లీ గురించి ఏం చెప్పలేను. ఆటలో అతను గ్రేటెస్ట్ ప్లేయర్లలో ఒకడు. మా జట్టులో అత్యంత ప్రొఫెషనల్ అతనే. ఏం చేయాలో అతనికిబాగా తెలుసు.’ అని తెలిపాడు.
షమీ జట్టులో భాగమే
పేసర్ మహ్మద్ షమీపై బుమ్రా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. అన్నీ కుదిరితే షమీ ఆస్ట్రేలియాకు వచ్చే అవకాశం ఉందన్నాడు. ‘షమీ జట్టులో భాగంగానే ఉన్నాడు. అతను బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. షమీపై మేనేజ్‌మెంట్ ఓ కన్నేసి ఉంచింది. త్వరలోనే అతను ఆస్ట్రేలియాకు వచ్చే అవకాశం ఉంది.'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.