వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్

Update: 2023-05-10 14:28 GMT

తాష్కెంట్: భారత స్టార్ బాక్సర్, కామన్వెల్త్ గేమ్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్ హుసాముద్దీన్ అదరగొట్టాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న పురుషుల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈ తెలంగాణ బాక్సర్ సెమీస్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకున్నాడు. 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన హుసాముద్దీన్ తొలి బౌట్ నుంచి సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అద్భుత విజయం అందుకున్నాడు. బల్గేరియా బాక్సర్ డియాజ్ ఇబానెజ్‌పై 4-3 తేడాతో గెలుపొందాడు. గత మూడు బౌట్లలో ఏకపక్ష విజయాలు సాధించిన హుసాముద్దీన్‌కు క్వార్టర్స్‌లో డియాజ్ నుంచి గట్టి పోటీఎదురైంది. ప్రారంభం నుంచే ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం పంచ్‌లను మార్చుకున్నాడు.

అయితే, హుసాముద్దీన్ కచ్చితమైన పంచ్‌లతో పైచేయి సాధించి మెజార్జీ జడ్జీల మద్దతు పొందాడు. దాంతో సెమీస్‌కు అర్హత సాధించి పతకం ఖాయం చేసుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హుసాముద్దీన్‌ మెడల్ సాధించడం ఇదే తొలిసారి. 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో అతను బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మరో ఇద్దరు భారత బాక్సర్లు దీపక్ బోరియా(51 కేజీలు), నిశాంత్ దేవ్(71 కేజీలు) సైతం సెమీస్‌‌కు అర్హత సాధించి పతకాలు ఖాయం చేసుకున్నారు.

ఈ ఈవెంట్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న అతను క్వార్టర్స్ బౌట్‌లో 5-0 తేడాతో కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన నూర్జిగిట్ డియుషె‌బావ్‌ను చిత్తు చేశాడు. తొలి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్.. అద్భుతమైన డిఫెన్స్‌తోపాటు ఎటాకింగ్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి ఏకపక్ష విజయం అందుకున్నాడు. మరో బాక్సర్ నిశాంత్ దేవ్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన జార్జ్ క్యూల్లార్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. దాంతో ముగ్గురు భారత బాక్సర్లు కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్ ఒకటి ఎక్కువ పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News