Women’s Asian Champions Trophy 2023: మహిళల హాకీ టీమ్ ప్రకటన..

Update: 2023-10-11 14:35 GMT

న్యూఢిల్లీ: ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వరకు జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరగనున్న ‘ఉమెన్స్ ఆసియన్ చాంపియన్ ట్రోఫీ-2023’కి భారత మహిళల జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. టీమ్‌లో మొత్తం 20 మందికి చోటు దక్కగా, సవితా పునియా నాయకత్వం వహించనుంది. గోల్‌ కీపర్లుగా సవితతోపాటు, బిచ్చు దేవి ఉండనుండగా, డిఫెండర్లుగా నిక్కి ప్రధాన్, ఉదిత, ఇషిక, డీప్ గ్రేస్‌లు వ్యవహరించనున్నారు. వీరితోపాటు మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్స్ ప్లేయర్లుగా నిషా, సలీమ, నేహ, నవనీత్ కౌర్, సోనిక, మోనిక, జ్యోతి, బల్జీత్, లాల్‌రెమిసియామి, సంగీత, దీపిక, వందన ఎంపికయ్యారు.

షర్మిలా దేవీ, వైష్ణవి విఠల్ రిప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా సెలెక్ట్ అయ్యారు. ఈ టోర్నీలో భారత్‌తోపాటు జపాన్, చైనా, కొరియా, మలేషియా, థాయిలాండ్ జట్లు టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి. ఇటీవలి ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం దక్కించుకున్న భారత్.. త్వరలో జరగనున్న చాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో (27న) థాయిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత 28న మలేషియా, 30న చైనా, వచ్చే నెల 2న కొరియా జట్లతో పోటీ పడనుంది. పూల్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం వచ్చే నెల 4న సెమీఫైనల్, 5న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.


Similar News