Asia cup: రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. యూఏఈపై భారత్ ఘన విజయం

శ్రీలంక వేదికగా జరుగుతోన్న ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే దాయాది పాక్‌ను చిత్తు

Update: 2024-07-21 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే దాయాది పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా అమ్మాయిలు.. తాజాగా ఇవాళ యూఏఈపై ఘన విజయం సాధించారు. రిషె ఘోష్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ 78 పరుగుల తేడాతో గెలుపొంది లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, డంబుల్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. షెఫాలీ వర్మ 37, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 పరుగులు చేసి ఆకట్టుకోగా.. చివర్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ చేసింది. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాది పరుగుల వరద పారించింది. 64 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి భారత్‌కు భారీ స్కోర్ అందించింది.

యూఏఈ బౌలర్లలో కవిషా ఎగోడాగే రెండు వికెట్లు తీయగా.. సమైర ధరణిధర్క, హెచ్ హాట్‌చందాని చెరో వికెట్ సాధించారు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో చేధనకు దిగిన యూఏఈ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ ఈషా 38, కవిషా ఎగోడాగే 40 రన్స్ చేయగా.. మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడంతో యూఏఈ భారత్ ముందు తలవంచక తప్పలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రేణుకా, తనుజా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత్.. ఆసియా కప్ టోర్నీలో మరోసారి సెమీస్‌కు అడుగు దూరంలో నిలించింది.


Similar News