దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ బ్రేకులేసింది. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించి తిరుగులేని స్థితిలో నిలిచిన రాజస్థాన్.. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలర్లు అంతగా ప్రభావం చూపకపోవడంతో మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయినట్టయింది. అయితే, ఇదే సమయంలో దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న గుజరాత్‌కు.. ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి విజయాన్నందించాడు. దీంతో వరుసగా రెండు ఓటముల అనంతరం గుజరాత్ టైటాన్స్(జీటీ)కి ఓ విజయం దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(68 నాటౌట్), రియాన్ పరాగ్(76) అర్ధసెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది. 197 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి, మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శుభమన్ గిల్ (72) దంచికొట్టగా, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్(24 నాటౌట్; 11బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 3 వికెట్లు పడగొట్టగా, యుజువేంద్ర చాహల్ రెండు, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
చెలరేగిన గిల్..
197 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(35), గిల్ కలిసి తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. మరింత వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న వీరి జోడీని కుల్దీప్ సేన్ విడదీశాడు. ఇన్నింగ్స్ 8.2ఓవర్లో సాయిసుదర్శన్‌ను ఎల్బీగా వెనక్కిపంపాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ వేడ్(4), అభినవ్ మనోహర్ (1)లను సైతం కుల్దీపే పదో ఓవర్లో వరుస బంతుల్లో బౌల్డ్ చేశాడు. దీంతో 79 పరుగులకే జీటీ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్(16) మరోసారి నిరాశపరుస్తూ చాహల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు గిల్ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్న గిల్.. మరో 22 పరుగులు జోడించి తన వ్యక్తిగత స్కోరు 72(44 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్సులు) వద్ద చాహల్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ అభిమానుల్లో మ్యాచ్‌పై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.
12 బంతుల్లో 35.. రషీద్, తెవాతియా మెరుపులు
18 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ స్కోరు 162/6. జట్టు విజయానికి 12 బంతుల్లో 35 పరుగులు అవసరం ఉండగా, గుజరాత్ అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, అప్పుడే బ్యాటింగ్‌కు రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. కుల్దీప్ సేన్ వేసిన 19వ ఓవర్లో ఇద్దరూ కలిసి ఏకంగా 20 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. 20వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేయగా, తొలి బంతికే రషీద్ ఖాన్ ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీశాడు. మూడో బంతికి మరో ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి సింగిల్ తీసి తెవాతియాకు ఇచ్చాడు. అయితే, ఐదో బంతికి రెండు పరుగులు పూర్తిచేసుకుని, మూడో పరుగు కోసం ప్రయత్నించడంతో తెవాతియా(11 బంతుల్లో 22; 3 ఫోర్లు) రనౌట్ అయ్యాడు. ఇక, చివరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా, రషీద్ ఖాన్(11 బంతుల్లో 24; 4ఫోర్లు) ఫోర్ కొట్టాడు. మొత్తంగా చివరి ఓవర్లలో 17 పరుగులు రావడంతో గుజరాత్ విజయం సాధించింది.
దంచికొట్టిన సంజూ, పరాగ్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. యశస్వి జైశ్వాల్(24) మరోసారి నిరాశపరిచాడు. దీంతో 32 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్(8) సైతం త్వరగానే అవుట్ అయ్యాడు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. కానీ, మూడో స్థానంలో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68 నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు), నాలుగో స్థానంలో వచ్చిన రియాగ్ పరాగ్ (48బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్న వీరు.. మూడో వికెట్‌కు ఏకంగా శతకానికి పైగా భాగస్వామ్యం నమోదుచేశారు. 18.4వ ఓవర్లో రియాన్ పరాగ్ అవుటవ్వగా, ఆ తర్వాత వచ్చిన హెట్‌మేయర్ 5 బంతుల్లోనే 13 పరుగులు జోడించడంతో 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 196కు చేరుకుంది.
స్కోరు బోర్డు:
రాజస్థాన్ రాయల్స్: 196/3(20 ఓవర్లు)
యశస్వి జైశ్వాల్ (సి) వేడ్ (బి) ఉమేశ్ 24, జాస్ బట్లర్ (సి) రాహుల్ తెవాతియా (బి) రషీద్ ఖాన్ 8, సంజూ శాంసన్ 68 నాటౌట్; రియాన్ పరాగ్ (సి) విజయ్ శంకర్ (బి) మోహిత్ శర్మ 76, హెట్‌మేయర్ 13 నాటౌట్; ఎక్స్‌ట్రాలు-7
వికెట్ల పతనం: 32-1, 42-2, 172-3
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ (4-0-47-1), స్పెన్సర్ జాన్సన్ (4-0-37-0), రషీద్ ఖాన్ (4-0-18-1), నూర్ అహ్మద్ (4-0-43-0), మోహిత్ శర్మ (4-0-51-1)
గుజరాత్ టైటాన్స్: 199/7 (20 ఓవర్లు)
సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) కుల్దీప్ సేన్ 35, గిల్ (స్టంప్ అవుట్) శాంసన్ (బి) చాహల్ 72, మాథ్యూ వేడ్ (బి) కుల్దీప్ సేన్ 4, అభినవ్ మనోహర్ (బి) కుల్దీప్ సేన్ 1, విజయ్ శంకర్ (బి) చాహల్ 16, రాహుల్ తెవాతియా (రన్ అవుట్) బట్లర్/ఆవేశ్ ఖాన్ 22, షారుఖ్ ఖాన్ (ఎల్బీడబ్ల్యూ) ఆవేశ్ ఖాన్ 14, రషీద్ ఖాన్ 24 నాటౌట్, నూర్ అహ్మద్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు-11
వికెట్ల పతనం: 64-1, 77-2, 79-3, 111-4, 133-5, 157-6, 195-7
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ (2-0-8-0), ఆవేశ్ ఖాన్ (4-0-48-1), కేశవ్ మహరాజ్ (2-0-16-0), అశ్విన్ (4-0-40-0), యుజువేంద్ర చాహల్ (4-0-43-2), కుల్దీప్ సేన్ (4-0-41-3)