చెమటోడ్చిన జకో.. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు

ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్ నోవాక్ జకోవిచ్ మరో రౌండ్‌ను కష్టంగా దాటాడు.

Update: 2024-06-03 19:37 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్ నోవాక్ జకోవిచ్ మరో రౌండ్‌ను కష్టంగా దాటాడు. మూడో రౌండ్‌లో పోరాడి గెలిచిన అతను నాలుగో రౌండ్‌లోనూ విజయం కోసం చెమటోడ్చాడు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ నాలుగో రౌండ్‌లో జకో 6-1, 5-7, 3-6, 7-5, 6-3 తేడాతో అర్జెంటీనా ప్లేయర్ ఫ్రాన్సిస్కో సెరుండోలోపై పోరాడి గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 4 గంటల 39 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఫలితం ఐదు సెట్లలో తేలింది. ఆరు ఏస్‌లు, 52 విన్నర్లు బాదిన జకో ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి పైచేయి సాధించాడు.

మెద్వెదెవ్ ఇంటికి..

5వ సీడ్ మెద్వెదెవ్ ఇంటిదారిపట్టాడు. నాలుగో రౌండ్‌లో అతనికి 11వ సీడ్ అలెక్స్ డె మినార్(ఆస్ట్రేలియా) షాకిచ్చాడు. మెద్వెదెవ్‌పై 6-4, 2-6, 1-6, 3-6 తేడాతో అలెక్స్ డె మినార్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొదట తొలి సెట్‌ను నెగ్గి మెద్వెదెవ్ శుభారంభం చేశాడు. ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు వరుసగా మూడు సెట్లను నెగ్గి మెద్వెదెవ్‌ ఓటమిని శాసించాడు. మూడు డబుల్ ఫౌల్ట్స్, 27 అనవసర తప్పిదాలతో మెద్వెదెవ్ మూల్యం చెల్లించుకున్నాడు. మెద్వెదెవ్ 2021లో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2వ సీడ్ సిన్నర్(ఇటలీ) 2-6, 6-3, 6-2, 6-1 తేడాతో మౌటెట్(ఫ్రాన్స్)ను ఓడించి తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో 2వ సీడ్ సబలెంక జోరు కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌లో ఆమె 6-2, 6-3 తేడాతో ఎమ్మా నవారో(అమెరికా)పై నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 4వ సీడ్ రిబాకినా(కజకిస్తాన్) 6-4, 6-3 తేడాతో 15వ సీడ్ స్విటోలినా(ఉక్రెయిన్)‌ను మట్టికరిపించి ముందడుగు వేసింది.

క్వార్టర్స్‌కు బోపన్న జోడీ

పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారుడు రోహన్ బోపన్న, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అయితే, మూడో రౌండ్‌ను బోపన్న జోడీ కష్టంగా దాటింది. మూడో రౌండ్‌లో బోపన్న జోడీ 6-7(2-7), 6-3, 7-6(10-8) తేడాతో మరో భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ-రెయెస్ వరెలా(మెక్సికో) జంటపై పోరాడి గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయి బోపన్న, ఎబ్డెన్ ద్వయం.. మిగతా రెండు సెట్లను దక్కించుకుంది. రసవత్తరంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్‌ను టై బ్రేకర్‌లో సొంతం చేసుకోవడంతో బోపన్న జోడీ విజయం లాంఛనమైంది. 


Similar News